Monday, January 04, 2016

మీలో ఎవరు కోటీశ్వరుడు

🎄🙏🎄🙏🎄🙏🎄🙏🎄

మీలో ఎవరు కోటీశ్వరుడులో  ఒకమ్మాయి "బాబా సాహెబ్" అనే బిరుదు ఎవరికి ఉందంటే వల్ల్భాయి పటేల్ అనుకుని, లాభం లేదని ఆడియన్స్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళలో కేవలం 26% మంది మాత్రమే అంబేద్కర్ పేరు చెప్పారు.

ఈ ప్రోగ్రాం మూడు సీజన్స్ నుంచీ చూస్తున్నాను!
క్విజ్ ప్రోగ్రాములంటే సిద్దార్థ బసు రోజుల నుంచీ ఉన్న ఇష్టం వల్ల!మూడు సీజన్స్ లోనూ తెలివి తేటల్తో కోటి గెలవాలని వచ్చే వాళ్లలో యూత్ అంటే కనీసం 30 ఏళ్ళ లోపు వాళ్ళు వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్, లేదా లేటెస్ట్ సినిమాలు, లేదా క్రికెట్ ఇవి తప్ప మిగతా ఏ ప్రశ్నలు వేసినా జవాబులు తెలీవు.
లాటరీ వేయడం లైఫ్ లైన్లు తీసుకోడం!

అక్బర్ కి బాబర్ ఏమవుతాడో తెలీదు, అశోకుడి కాలం తెలీదు, బుద్ధుడు ఎక్కడ పుట్టాడో తెలీదు, యూరప్ కరెన్సీ తెలీదు, దక్షిణ అమెరికా ఎక్కడ ఉందంటే తెలీదు ,హిట్లర్ పేరు తెలుసు గానీ (చిరంజీవి వల్ల కాబోలు) ఏ దేశానికి చెందిన వాడంటే తెలీదు, అసలు ముస్సోలినీ అనేది ఒక మనిషి పేరంటే ఆశ్చర్యం!

లాస్ట్ సీజన్లో MBA చదివినామె వచ్చింది. ఆమె అమెరికా కూడా దర్శించిందట. ఆమెకు డాలర్ గుర్తు తెలీదు. రూపాయి గుర్తు తెల్సా అంటే "తెలుసు! 2 నంబర్ నెత్తి మీద అడ్డగీత ఉంటుందే అది" అని చెప్పింది. అది హిందీ "ర" అని తెలీదు.

40 ఏళ్ళ వ్యక్తి ఒకరికి "నల్లేరు మీద బండి నడక" అంటే అర్థం తెలీదట.
ఇంకొకరికి ఒపీనియన్ అనే మాటకు తెలుగు పదం తెలీదు. గూగుల్ లో పని చేసే ఇంజనీర్ కి "పిక్సెల్" అంటే తెలీదు. ఫొటోగ్రఫీ నాకు భయంకరమైన హాబీ అని చెప్పినామెకు "జెపెగ్"అంటే తెలీదు.

నూటపది క్విజ్ లలో ప్రైజులొచ్చాయని చెప్పిన ఒకరికి "తియాన్మెన్ స్క్వేర్ " ఎక్కడుందో తెలీదు. కాబట్టి అక్కడేం జరిగిందో ఎందుకు జరిగిందో వాళ్లకి తెలుసేమో అని ఆశ అక్కర్లేదు

దేశ నాయకుల్లో గాంధీ నెహ్రూ మహా అయితే ఈ మధ్య పటేల్, ఇంతకు మించి ఎవరూ తెలీదు.

చేగెవారా టీ షర్టులు నాలుగైదు డిజైన్స్ లో వార్డ్ రోబ్ లో ఉంటాయి గానీ వాడెవరో పాపం, ఏ దేశం, అసలేం చేసి టీ షర్టులకెక్కాడు..ఇవన్నీ అనవసరం

ఇహ పురాణాలు పుస్తకాలు ఇతిహాసాల సంగతి ఎత్తక్కర్లేదు. దశరధుడికి ఊర్మిళ ఏమౌతుందో, కృష్ణుడి మేనత్త ఎవరో, కర్ణుడిని పెంచిన తల్లెవరో, దశావతారాల్లో నాల్గోది ఏదో.. ఇవన్నీ పూర్తిగా ఫ్రెంచ్ అండ్ లాటిన్!!

ఇహ సాహిత్యం పరిచయమే లేదు. కావ్యాలు కవులు సంగతి అలా ఉంచి, నిన్న మొన్నటి శ్రీ శ్రీ ఏం రాశాడో కూడా తెలీదు. మహా అయితే వీళ్లకి చంద్ర బోస్ , సీతారామ శాస్త్రి తెలుస్తారు. అది కూడా వాళ్ళు తరచూ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంటారు కాబట్టి. వాళ్ళే పాట రాశారో నాలుగు ఆన్సర్లు, మూడు లైఫ్ లైన్లు ఇంకా కొన్ని క్లూలు ఇస్తే కనుక్కుంటారేమో!

వీళ్ళలో చాలా మందికి చదువులో హయ్యెస్ట్ మార్కులు మార్కులు వస్తాయట. కొంతమంది గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నామని చెప్తారు. వాళ్ల మీద కొంత ఆశ పెట్టుకుందాం అంటే... ఉహూ.. లాభం లేదు! వాళ్ళూ అంతే!

ఉద్ధ్యోగానికి పనికొచ్చే చదువులు కావాలని నినాదాలు చేసి చేసి.. చివరికి ఉజ్జోగం గురించి తప్ప ఇక దేని గురించీ అవగాహన లేకుండా.. ఇలా ఉన్నారేంటి? అనిపించక మానదు.

ఇవన్నీ తెలీక పోవడం నేరమో ఘోరమో కాదు!
కాల క్రమేణా "నాలెడ్జ్" అనే పదానికి అర్థం ఎలా మారి పోతూ వచ్చిందో గమనిస్తే విస్మయం!

"ఇతర పుస్తకాలు చదవడం"అనేది ఇండియాలో పిల్లల/విద్యార్థుల జీవితాల్లోంచి దాదాపుగా అదృశ్యమై పోయింది. న్యూస్ పేపర్ చదవడం అసలే లేదనుకుంటా. న్యూస్ చానెల్స్ లోనా అర్నబ్ గోల కోసమో, టీవీ9 పోలీసులకంటే ముందే ఛేదించిన కేసు కోసమో చూస్తున్నామాయె!

వ్యవసాయం అంటే తెలీదు. రైతుల ఆత్మ హత్యల గురించి వార్తలు వస్తున్నాయి కాబట్టి అది తెలుస్తుంది గానీ దానికి మూల కారణాలేవంటే అవగాహన లేదు.అసలు రబీ, ఖరీఫ్ అంటే తెలీదు. అమరావతి లో రియల్ ఎస్టేట్ రేట్స్ బాగున్నాయని తెలుస్తుంది మళ్ళీ!

చదివి నేర్చుకుని గుర్తు పెట్టుకునే ఆగత్యం ఎవరికీ లేదిప్పుడు! అవసరం పడితే గూగుల్ చేయడం సులువైన పని!

అసలు పదో తరగతి వరకూ హిస్టరీ అనే సబ్జెక్ట్ ఉందా, రాజ్యాంగం గురించి , పార్లమెంట్, ఫండమెంటల్ రైట్స్, లెజిస్లేచర్, ఫెడరేషన్, ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఐక్య రాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ ఇలాటి అంశాలు సిలబస్ లో ఉన్నాయో లేవో మరి!!

పల్లెలు, టౌన్ ల నుంచి వచ్చే పిల్లలు సిటీ విద్యార్థుల కంటే మెరుగైన కామన్ సెన్స్ ని, పరిణతిని, ఆలోచనా విధానాన్ని, చుట్టూ ఉన్న సమాజం గురించి కొంత పరిజ్ఞానాన్ని కల్గి ఉంటున్నారు ఈ షోలో! పోయినవారం వచ్చిన ఒక బి టెక్
విద్యార్థి (రాయల సీమ నుంచి వచ్చాడు) "ఇండియాలో అరబ్స్ నిర్మించిన మొదటి మసీదు ఏ రాష్ట్రంలో ఉంది" అనే ప్రశ్నకు జవాబు తెలీకుండా, ఎలిమినేషన్ ప్రాసెస్ అద్భుతంగా చేసి జవాబు కనిపెట్టాడు!

గ్రామాల నుంచి , టౌన్ ల నుంచి వచ్చే వాళ్లకి సామెతలు తెలుసు,వాడుక లో ఉన్న జాతీయాలు తెల్సు, బాంకింగ్ సర్వీసులు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పట్ల అవగాహన ఉంటుంది. సిటీవిద్యార్థులు చాలా మందికి సొంత వూరు ఎక్కడుందో తెల్సినా అదొక వెకేషన్ పాయింట్ మాత్రమే కావడం వల్లనేమో..ఏమీ తెలీదు.

కిరణ చక్రవర్తుల అన్నట్టుగా తెలీని ప్రశ్నకు జవాబు ఎప్పుడైనా తెలిస్తే (నిజానికి దాన్ని జన్మలో మర్చిపోలేం) "ఓ అవునా
'అన్న సంతృప్తిని, ఆసక్తి ని కూడా ప్రదర్శించటం లేదు చాలా మంది

హిస్టరీ, సాహిత్యం, సంస్కృతి, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ చదువుకునే రోజుల్లో బోరింగ్ గానే ఉండొచ్చు. కానీ అవి జీవన వికాసానికి మార్గాలు! మెదడు మనసుల తలుపుల్ని తెరిచే దార్లు!

ఐ ఐ టీ లో సీటు, అమెరికా లో ఉద్యోగం, ఈ రెండే ధ్యేయంగా నడుస్తున్న చదువుల్లో, చుట్టూ పరుచుకుని ఉన్న మీడియా డామినేటెడ్ వాతావరణం లో ఇంతకంటే విజ్ఞానం ఎలా సంపాదిస్తారు? అసలు వాళ్లకి మిగతావి చదివే టైముందో లేదో?

రాజకీయాల గురించి మీడియా కథనాలను బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం తప్ప , ఈ దేశం రాజకీయ వ్యవస్థకు పునాదులు ఎక్కడ పడ్డాయో, ఏ పార్టీ ఎటువంటిదో, కూలంకషం గా చదివే ఓపిక టైము ఎవరికీ లేవు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం!']

ముఖ్యంగా పాతికేళ్ల లోపు వాళ్ళు గట్టిగా ఆత్మ విశ్వాసంతో జవాబు చెప్పగలిగే ప్రశ్నలు లేటెస్ట్ సినిమాలు, క్రికెట్ రంగాలవే! స్పోర్ట్స్ లో కూడా మిగతావి తెలీదు. సానియా తెలుస్తుంది కానీ కిడాంబి శ్రీకాంత్ తెలీదు, సైనా తెలుస్తుంది కానీ ధనరాజ్ పిళ్ళై ఎవరో ఏ ఆటగాడో తెలీదు!

సోషల్ స్టడీస్, సాహిత్యం ,సంస్కృతి , సొసైటీ ఇలాటివి చదవడం వల్ల ఉద్యోగాలు రాక పోవచ్చు. కానీ దృక్పథాలు విశాలం అవుతాయి. జీవితం లో సౌందర్యం అనుభవం అవుతుంది. మెదడే కాక మనసొకటి ఉందనే విషయం అవగతమౌతుంది.

ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ లాగా "ఈ నాలెజ్ వల్ల మాకేం ఒరుగుతుంది? మాకు ఉజ్జోగాలు ఇచ్చే చదువులే కావాలి" అని పోజు పెడితే...

అవును,ఆ చదువుల వల్ల ఉజ్జోగాలొస్తాయి,
జేబులో రూపాయలో డాలర్లో ఉంటాయి.
పర్సులో క్రెడిట్ కార్డులు , బాంక్ లో బాలెన్సూ ఉంటాయి.
ప్రతి వారాంతమూ మాల్స్ లోనే గడపొచ్చు!

ఇవన్నీ ఉంటాయి. కానీ ,.......

జీవితం లో "వికాసం" "సౌందర్యం" భాగాలు ఖాళీగా ఉంటాయి.

అంతకు మించి ఏమీ అనర్థం జరగదు

మీరేమంటారు ???

🎄🎄🎄🎄🎄🎄🎄🎄
( posted as received in whatsapp )

No comments:

Post a Comment